News Telangana :-
నిర్లక్ష్యం ఓ మునిసిపల్ కమిషర్ కొంప ముంచింది. కొత్తపేటలో ప్రైవేటు భూమిని ఆక్రమించి, కోర్టు ధిక్కార కేసులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు తెలంగాణ హైకోర్టు ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాదు రూ. 2,000 జరిమానాతో పాటు 2024 జనవరి 2వ తేదీన హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశించింది హైకోర్టు. గుంటూరు నగరంలోని కొత్తపేటలో యడవల్లి వారి సత్రానికి చెందిన 3,300 గజాల స్థలాన్ని 1965వ సంవత్సరంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమించి ఇప్పటికీ కాసుశాయమ్మ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నారు. అయితే, ఈనాటి వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అక్రమంగా సత్రం ఆస్థిని ఉపయోగిస్తుండంతో, విజయవాడకు చెందిన కప్పగంతు జానకిరాం హైదరాబాద్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. పిటీషనర్ తరఫు న్యాయవాది ఫణిదత్ చాణక్య వాదనలు వినిపించారు. సక్రమమైన లీజు లేకుండా సత్రం ఆస్థిని స్వాధీనం చేసుకున్నవారు ఎవరైనా సరే, అక్రమ ఆక్రమణదారులే అవుతారని వాదించారు న్యాయవాది ఫణిదత్. ఇందుకు ప్రభుత్వ శాఖలు కూడా మినహాయంపు కాదని, అనుమతి లేకుండా ఏళ్ళ తరబడి సత్రం ఆస్థిని అనుభవించడం చట్ట విరుద్ధమని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సత్రానికి బాకాయి పడిన రూ. 2 కోట్ల 70 లక్షలను తక్షణమే చెల్లించి, ఆస్థిని ఖాళీ చేయమని ఆదేశించమని హైకోర్టుకు నివేదించారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ హైకోర్టు.. ఈ మేరకు తీర్పునిచ్చారు. దీంతో కౌంటర్ దాఖలు చేసింది గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్. సదరు బకాయిలు చెల్లించలేని స్థితిలో జీఎంసీ ఉన్నదని, పేదల సంక్షేమం కొరకు ఉచిత పాఠశాల నిర్వహిస్తున్నామని, బకాయిలు రద్దు కోరుతున్నామని తెలిపారు. కానీ హైకోర్టు తాత్కాలిక ఏర్పాటుగా గతేడాది ఏఫ్రిల్ 12న మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 12వ తేదీ నాటికి రూ. 25 లక్షలు చెల్లించాలని, తక్షణమే ప్రతి నెలా ప్రతి చదరపు అడుగుకి రూ.2/- చొప్పున అద్దె చెల్లించాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారిని ఆదేశించింది కోర్టు. హైకోర్టు ఉత్తర్వులను ఉద్దేశ పూర్వకంగా అమలుచేయకపోవడంతో, జీఎంసీ కమిషనర్‌ను కోర్టు ధిక్కార నేరం క్రింద పరిగణిస్తూ, ఒక నెల రోజులు సాధారణ జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధిస్తూ, 2024 జనవరి 2వ తేదీన హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశించింది హైదరాబాద్ హైకోర్టు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.