- సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
- దురాక్రమణల తొలగింపును రాజకీయాలతో ముడి పెట్ట వద్దు
- ప్రజా సౌకర్యార్థమే ఆక్రమణల తొలగింపు
న్యూస్ తెలంగాణ, ఆర్మూర్ ప్రతినిధి షికారి శ్రీనివాస్, నవంబర్ 11 -:
న్యూస్ తెలంగాణ సమగ్ర దినపత్రికలో అక్టోబర్ 30వ తేదీన ప్రచురితమైన లక్షలు వెచ్చించి నిర్మించిన ఫూట్ పాత్ ఎక్కడ అనే వార్తకు విశేష స్పందన లభించింది. సోమవారం ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ బ్రిడ్జి, పాత వెంకటేశ్వర థియేటర్, కొత్త బస్టాండ్ వరకు రోడ్డుకు రెండు వైపులా గల ఫుట్ పాత్ ఆక్రమణలను ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారులు మరియు సిబ్బంది, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పర్యవేక్షణలో రహదారిని, నడకదారిని ఆక్రమించుకుని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న పండ్ల దుకాణాలను డేరాలను ఆక్రమణలను జెసిబి సహాయంతో తొలగించడం ప్రారంభించారు. తొలగించిన బోర్డులను, కర్రలను మునిసిపల్ కు తరలించారు. డ్రైనేజీలను ఆక్రమించుకొని వేసిన ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆనుకొని ఉన్న ఖోకాలను జెసిబి సహాయంతో మునిసిపల్ అధికారులు తొలగించడానికి ప్రయత్నించగా ఖోకాల యజమానులు అధికారులకు ఒకరోజు సమయం కోరగా ఒక రోజులో ఖోకాలను తీసివేయాలని, లేనిచో ఖోకాలను మునిసిపల్ బండిలో వేసి మున్సిపల్ కార్యాలయం తరలిస్తామని అధికారులు చెప్పారు.
ఫుట్ పాత్ దురాక్రమణలు తొలగిస్తున్నారన్న విషయం ద్రావణంల ప్రజలకి తెలవగా తండోపతండాలుగా ప్రజలు వచ్చి చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇక వాహనదారులు మాకు ట్రాఫిక్ సమస్య తీరినట్లేనని అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఫుట్ పాత్ దురాక్రమణలు తొలగించడంతో వాహనదారులకు పాదాచారులకు రోడ్డు విశాలంగా సౌకర్యవంతంగా మారింది. ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యంగా రహదారుల ఆక్రమణలను తొలగించడం జరుగుతున్నదని, దురాక్రమణల తొలగింపును రాజకీయాలతో ముడి పెట్టవద్దని, ప్రజల సౌకర్యార్థమే అందరి క్షేమం కోరి దురాక్రమణలు తొలగించడం జరుగుతుందని, ట్రాఫిక్ సమస్యలు రాకుండా, ఇప్పటికైనా దుకాణాదారులు రోడ్లను కబ్జా చేయకుండా తమకు సంబంధించిన దుకాణంలోనే పండ్లు ఇతరత్రా అమ్ముకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లన్నీ ఆక్రమిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, తాము చెప్పినా వినకుండా మళ్లీ యధావిధిగా నడకదారిని, రహదారిని ఆక్రమిస్తే సదరు దుకాణదారునికి పెద్ద మొత్తంలో జరిమానా విధించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి గజానంద్ మరియు మున్సిపల్ సిబ్బంది, ఆర్మూర్ స్టేషన్ హౌస్ అధికారి సత్యనారాయణ గౌడ్, ఏఎస్సైలు గుండు చిన్నయ్య, లక్ష్మణ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.