మద్దూరు నవంబర్13(న్యూస్ తెలంగాణ)
మండలంలోని నరసాయపల్లె గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్ష చేసి రైతుల పొలాల నుండి మట్టి నమూనాలను సేకరించినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భూమిమీద ఉన్న సమస్త జీవరాశులకు మట్టే జీవనాధారం అన్నారు.మనుషులు తీసుకునే ఆహారంలో 95% మట్టి నుండే వస్తుంది. మిగతా అయిదు శాతం సముద్రాలు,నదులు మొదలైన వాటి నుండి లభిస్తుంది.అవసరానికి మించిన మానవ కార్యకలాపాల వల్ల రానురాను మట్టి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది.
ఒక టేబుల్ స్పూన్ మట్టిలో ఈ భూమి మీద ఉన్న మనుషుల కంటే ఎక్కువ జీవరాశులు ఉంటాయి. వాస్తవానికి మనం తీసుకునే ఆహారాన్ని మనంతట మనం జీర్ణించుకోలేము. ఇదే విధంగా మట్టిలోని పోషకాలను మొక్కలు, చెట్లు వాటంతటవి తీసుకోలేవు.వాటికి సూక్ష్మజీవుల అవసరం ఎంతైనా ఉంది.ఉదాహరణకు వాతావరణంలో 78 శాతం నత్రజని ఉన్నప్పటికిని దానిని మొక్కలు సూటిగా వినియోగించుకోలేవు. వాతావరణంలోని నత్రజని మొక్కలకు ఉపయోగపడే రూపంలోకి రైజోబియం అనే బ్యాక్టీరియా ద్వారా మారుతుందనీ అన్నారు.
అలాగే సూడోమోనాస్, బాసిల్లస్ అనే బ్యాక్టీరియాలు మట్టిలో కరగని రూపంలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందజేస్తాయి. దీనిని బట్టి మట్టిలో సూక్ష్మజీవుల అవసరం ఎంతైనా ఉందని మనకు అర్థమౌతుంది.
రైతుల పొలాల నుండి గ్రిడ్ పద్ధతిలో మట్టిని సేకరించి భూసార పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరిపి వచ్చిన ఫలితాల ఆధారంగా ఏ పంటను సాగు చేయాలో తెలిపి ఎరువుల మోతాదును సిఫార్సు చేస్తారు. ఈ సాయిల్ హెల్త్ కార్డ్లో పిహెచ్, లవణ సూచిక, సేంద్రీయ కర్బనం అంశాలతో పాటు లభ్య నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్ మరియు బోరాన్లు ఎంత పరిమాణంలో ఉన్నాయో పొందుపరుస్తారు. పంట మార్పిడికి మరియు తగిన మోతాదులో పంటకు ఎరువులు వినియోగించుకోవలి
మానవాళి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే భూమి ఉపరితలం పైన ఒక ఇంచు మట్టి ఏర్పడాలంటే ఐదు వందల సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అనగా మట్టి ఏర్పడడం అనేది చాలా చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. మట్టి ఎవరి ఆస్తి కాదు. మన ముందు తరాల నుండి మనకి సంక్రమించింది. దాన్ని సజీవమైనదిగా మన తరువాతి తరం వారికి అందించడం మనందరి బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.