June 21, 2024
News Telangana
Image default
PoliticalTelangana

Harish Rao | రైతు నోట్లో మట్టి.. రుణమాఫీ, రైతుబంధుకు కాంగ్రెస్‌ మొండిచెయ్యి: హరీశ్‌రావు

 • మొత్తం 83 వేల కోట్లకు ఇచ్చింది 19వేల కోట్లే
  82 వేల కోట్లకు 19 వేల కోట్లిస్తారా?
  రైతు భరోసాకే ఏటా 22 వేల కోట్లు కావాలి
  సాగుకు 19 వేల కోట్లు ఎలా సరిపోతాయ్‌?: హరీశ్‌
 • నిరుద్యోగులు, ఉద్యోగుల ఆశలపై కాంగ్రెస్‌ సర్కారు నీళ్లుజల్లింది
  24 గంటల కరెంటు ఎక్కడిస్తుండ్రు
 • పింఛన్లపై సీఎం నోరు విప్పరేం?
 • గృహజ్యోతికి రూ.2,400 కోట్లు ఎలా సరిపోతాయి?
 • మహాలక్ష్మి రూ.2,500 ఎక్కడ?
 • ఆరు గ్యారెంటీలపై చట్టం ఏది?
 • నాడు అప్పులని ఏడ్చి.. మీరెలా రూ.59 వేల కోట్ల అప్పు తెస్తారు?
 • బడ్జెట్‌లో అన్ని వర్గాలకు అన్యాయం
 • మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం ( Harish Rao )

హైదరాబాద్‌, ( News Telangana ) : ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వృద్ధు లు, వికలాంగులతో అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే మొండిచెయ్యి చూపిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బడ్జెట్‌ అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రభుత్వం అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. తొలిరోజు నుంచే వాగ్దాన భంగానికి పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రజాపాలనపై సీఎం చాలా గొప్పగా చెప్పారని, ప్రతిరోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తానని చెప్పి.. కొద్దిరోజులు మంత్రులకు, ఆ తర్వాత అధికారులకు, ఇప్పుడు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వినతులు అప్పగించారని ఎద్దేవా చేశారు. మొ త్తానికి సోకాల్డ్‌ ప్రజాపాలన అభాసు పాలైందని విమర్శించారు. బడ్జెట్‌పై కొండంత ఆశలు చూపించి.. గోరంత కేటాయింపులు కూడా చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం నాటి నుంచి ఊదరగొడుతున్న ఆరు గ్యారెంటీల అమలుపై బడ్జెట్‌లో స్పష్టత ఇవ్వలేదన్నారు.

 • రూ.82 వేల కోట్లకు రూ.16 వేల కోట్లా?

తెలంగాణ వ్యవసాయరంగానికి ఏటా కనీ సం రూ.82 వేల కోట్లు అవసరమైతే.. బడ్జెట్‌ లో రూ.16 వేల కోట్లు మాత్రమే ఎలా కేటాయిస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘కోటిన్నర ఎకరాల సాగుభూమికి కాంగ్రెస్‌ ఇస్తామన్న రూ.15 వేల రైతుభరోసాను లెక్కలేస్తే, ఆ ఒక పథకానికే ఏటా రూ.22,500 కోట్లు కావాలి. డిసెంబర్‌ 9నే రుణమాఫీ చేస్తామన్నా రు. ఇప్పుడు ఫిబ్రవరి 9 కూడా వెళ్లిపోయింది. రుణమాఫీపై బడ్జెట్‌లో కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదు. రైతు రుణమాఫీకి ఏటా రూ.40 వేల కోట్లు అవసరం. కానీ, నాలుగు రూపాయలు కూడా కేటాయించలేదు. మేం రైతులందరికీ రైతుబీమా చేశాం. కాంగ్రెస్‌ పార్టీ కౌలు రైతులకు కూడా రైతుబీమా ఇస్తామని చెప్పిం ది. అందుకు కనీసం రూ.2 వేల కోట్లు అవసరం. దానిపై కూడా బడ్జెట్‌లో స్పష్టత లేదు. వడ్లు, మకలు, కంది, సోయా, జొన్న పంటలకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్‌ కూడాఇస్తామన్నారు. వాటికి కనీసం రూ.15 వేల కోట్లు అవసరం. బోనస్‌ను కూడా బోగస్‌ చేశారు. ఉద్యావన పంటలు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌, స్ప్రింక్లర్‌ సెట్లకు అన్నీ కలుపుకొని మొత్తం రూ.82 వేల కోట్ల బడ్జెట్‌ అవుతుది. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం జీతాలు పోగా కేవలం రూ.16 వేల కోట్లు కేటాయించడం సిగ్గుచేటు. దగా చేసిన కాంగ్రెస్‌ సర్కారు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని హెచ్చరించారు.

 • 24 గంటల కరెంట్‌పై సవాల్‌కు సిద్ధమా?

కాంగ్రెస్‌ ప్రభుత్వం అటు ఎన్నికల ప్రచారంలోనూ.. ఇటు నిండు అసెంబ్లీలోనూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. ‘ప్రజా పాలన ఒక అబద్ధం.. 24 గంటల కరెంటు మరో అబద్ధం. రాష్ట్రంలో ఎక్కడా రైతులకు 24 గంటల కరెంటు రావడం లేదు. సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఏ సబ్‌స్టేషన్‌కు వస్తారో చెప్పండి.. అక్కడికెళ్లి రికార్డులు తీద్దాం. ఎక్కడా 14-15 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదు. బడ్జెట్‌ ప్రసంగంలో మాత్రం 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. గతంలో కాంగ్రెస్‌ పానలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చామని, రైతులు చాలా ఆనందంగా ఉండేవారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మిలీనియం జోక్‌ వేశారు. దొంగరాత్రి కరెంటు ఇస్తే ఆనందంగా ఉన్నారా? అర్ధరాత్రి పొలానికి పోతే పాముకాట్లు, తేలుకుట్లతో రైతుల చనిపోతే ఆనందంగా ఉన్నారా? కరెంటు షాకుకు మరణిస్తే సంతోషంగా ఉన్నారా? నాటి కాంగ్రెస్‌ పాలనలో ఉచిత కరెంటు అంటే ఉత్త కరెంటే.. ఎటు చూసినా కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లే’ అని మండిపడ్డారు.

 • పింఛన్లపై సీఎం ఎందుకు మాట్లాడరు?

చేయూత పింఛన్లు రూ.4 వేలకు పెంచటంపై సీఎం ఎందుకు నోరు మెదుపటం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. రూ.10 లక్షల ఆరోగ్యశ్రీపై ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యప్తంచేశారు. ‘పింఛన్ల కోసం అన్నార్థులు, అభాగ్యులు, పేదలు, వృద్ధులు, వికలాంగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పింఛన్లను ఎగ్గొడుతున్నది. పింఛన్లను ఎందుకు ఎగ్గొడుతున్నారని అసెంబ్లీలో సీఎంను నిలదీస్తే నోరు మెదపడం లేదు. కాంగ్రెస్‌ ఇస్తామన్న రూ.4 వేల పింఛన్‌ ఇవ్వకపోగా.. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన రూ.2 వేల పింఛన్‌ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వటంలేదు. జనవరి, ఫిబ్రవరి నెల పింఛన్లు చాలామందికి నేటికీ రాలేదు. పింఛన్లు రాలేదని లబ్ధిదారులు మా ఎమ్మెల్యేల చుట్టు తిరుగుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్టయ్యింది’ అని మండిపడ్డారు.

 • రెండు లక్షల ఉద్యోగాలు లేనట్టేనా?

బడ్జెట్‌లో ఎక్కడైనా నిరుద్యోగ భృతి గురిం చి ప్రస్తావించారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘ఎన్నికల వేళ నిరుద్యోగ భృతి గురించి యువజన డిక్లరేషన్‌లో ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి చాలా గొప్పగా చెప్పారు. బడ్జెట్‌లో నిరుద్యోగులను ఎందుకు మర్చిపోయారు? ఏడాదిలో కొత్తగా రెండు ల క్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో అందుకు తగిన కేటాయింపులు ఎం దుకు చేయలేదు? ఉద్యోగులకు అదనంగా రూ.1000 కోట్లు కేటాయిస్తే.. పెండింగ్‌ ఎరియర్స్‌, డీఏలు, పీఆర్సీ బకాయిలు, ఐఆర్‌ వం టివి ఎలా చెల్లిస్తారు? ఉద్యోగులకు పీఆర్సీ పెం చుతూ బడ్జెట్‌లో నిధులు ఎందుకు పెట్టలేదు? కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటు ఉద్యోగులను అటు నిరుద్యోగులను మోసం చేసింది’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులకు మూడు డీఏలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.

 • 59 వేల కోట్ల అప్పు మీరెందుకు తెచ్చారు?

నేతి బీరకాయలో నెయ్యి ఉండటం ఎంత నిజమో.. కాంగ్రెస్‌ నేతల మాటల్లో కూడా ని జం అంతేనని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అ ప్పులు చేశారని మాపై ఏడ్చిన కాంగ్రెస్‌ నాయకులు, ఇప్పుడు మాకంటే రూ.19 వేల కోట్లు అధికంగా అప్పులు తీసుకొస్తామని చెప్పింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓపెన్‌ మార్కెట్‌ బారోయింగ్స్‌ కింద రూ.40 వేల కోట్ల అప్పులు తీ సుకొస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.59,620 కోట్లు అప్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది’ అని విమర్శించారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. వారి గురించి కూడా బడ్జెట్‌లో పెట్టాలని అడిగినా ఎక్కడా ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో కార్మికుల అప్పులను, రుణాలను మాఫీ చేయాలని, నెలవారీ భృతి రూ.10 వేలు ఇవ్వాలని, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో డిమాండ్‌ చేసినట్టు తెలిపారు. 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి కనికరం లేదని మండిపడ్డారు.

 • రూ.59 వేల కోట్లు ఎలా వస్తాయో చెప్పాలి

గత సంవత్సరం బడ్జెట్‌ను తగ్గించి రూ.2,24,624 వస్తున్నట్టు చెప్పి, రూ.2,75,896 కోట్ల బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారని, మిగతా రూ.59 వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘రూ.59 వేల కోట్లు రాబట్టేందుకు ప్రజలపై కొత్త పన్నులు వేస్తారా? భూములు అమ్ముతారా? ఆ డబ్బు ఎలా తెస్తారు?’ అని నిలదీశారు. గత ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు కనిపించడం లేదా? ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్న సీఎంకు ప్రివిలేజ్‌ నోటీసులు ఇవ్వాలని అన్నారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సంజయ్‌, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తాతామధు, దేశపతి శ్రీనివాస్‌ ఉన్నారు.

 • పంట బీమా ఎలా అమలు చేస్తారు?

కేసీఆర్‌ హయాంలో రైతును రాజు చేసేందుకు సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, పంట కొనుగోళ్లు వంటి అనేక పథకాలు తీసుకొస్తే.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పథకాలను తుంగలో తొక్కి.. రైతుల నోట్లో మట్టికొట్టి.. అన్నదాతలను ఆగం చేసిందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంకెలు మార్చి, ఆంక్షలు పెట్టి అన్నదాత నోరు కొట్టేలా బడ్జెట్‌ ఉన్నదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చాంతాడంత చెప్పి బడ్జెట్‌లో చెంచాడు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతుబంధుకు రామ్‌రామ్‌ చెప్పారని, రుణమాఫీకి మొండిచేయి చూపి పంటలకు బోనస్‌ బోగస్‌ అన్నట్టుగా బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయని అన్నారు. ‘ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.19,746 కోట్లు పెట్టామని చెప్పారు. అందులో రూ.3 వేల కోట్లు వేతనాలకు పోతే.. మిగిలిన రూ.16 వేలకోట్లలో రైతు భరోసా ఎంతొస్తది? రుణమాఫీ ఎంత చేస్తారు? రైతు బీమాకు నిధులు ఎలా ఇస్తారు? పంట బీమా ఎలా అమలు చేస్తారు? వీటన్నింటికి నిధులు ఏవి?’ అని సూటిగా ప్రశ్నించారు. రైతులకు అభయాస్తం కాస్తా మొండిచెయ్యిగా మారిందని ధ్వజమెత్తారు.

 • ఇందిరమ్మ ఇండ్లపైనా అబద్ధాలేనా?

నిండు శాసనసభ సాక్షిగా ఇందిరమ్మ ఇండ్లపై కూడా ప్రభుత్వ పెద్దలు అబద్ధాలు చెప్పారని హరీశ్‌రావు విమర్శించారు. ‘ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కలిపితే 4,16,500 ఇండ్లకు కనీసం రూ.20,820 కోట్లు అవసరం. ఎస్సీ, ఎస్టీలకు మరో లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఆ రకంగా మొత్తం రూ.23 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. బడ్జెట్‌లో మాత్రం రూ.7 వేల కోట్లు కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కూడా ప్రజలను మోసం చేశారు. మహాలక్ష్మి పథకం గురించి చాలా గొప్పగా చెప్పారు. రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన మహిళలు 1.50 కోట్ల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.2,500 ఇవ్వాలంటే రూ.45 వేల కోట్లు అవసరమవుతాయి. అన్ని పథకాలకు కలిపి రూ.52 వేల కోట్లు పెట్టారు. ఒక్క రైతు రుణమాఫీకే రూ.40 వేల కోట్లు కావాలి. ఇంత తక్కువ నిధులతో పథకాలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలి. ఇటు గృహజ్యోతికి రూ.8 వేల కోట్లు అవసరం ఉంటే.. రూ.2,400 కోట్లు మాత్రమే కేటాయించారు. 90 లక్షల మంది తెల్లరేషన్‌కార్డు దారులకు ఇవి ఎలా సరిపోతాయి. గృహజ్యోతిలో కూడా 75 శాతం మందికి కోతలు విధించేందుకే ఇలా చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • ఆరు గ్యారెంటీలపై చట్టం ఏది?

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలుపై శాసనసభ మొదటి సమావేశంలోనే చట్టం చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నేతలు ఎక్కడున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘చట్టం ఏమైంది? ఎందుకు చేయడం లేదు? రెం డు సభలు పూర్తయినా చట్టం ఎందుకు చేయలేదు. శ్వేత పత్రాలతో గత ప్రభుత్వం పై బురద జల్లుతూ కాలం గడుపుతున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ డిసెంబర్‌ 9న వేస్తామని బాండు పేపర్లు రాసిచ్చిన కాంగ్రెస్‌ నాయకులు ఎక్కడున్నారు? బడ్జె ట్‌ ప్రసంగంలో ఎక్కడైనా వందరోజుల్లో హామీల అమలుపై ప్రస్తావన ఉన్నదా? రెండు గ్యారెంటీలు అమలు చేశామని కాంగ్రెస్‌ నాయకులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల్లో ఒకటి మాత్రమే అమలు చేసిన మోసపుచ్చుతున్నారు’ అని మండిపడ్డారు.

0Shares

Related posts

NagaBabu: అది అబద్ధపు ప్రచారం రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు : నాగబాబు

News Telangana

చెక్ పోస్ట్ లో అక్రమ వసూళ్లు… అక్కడ అంతా ” మనీ “

News Telangana

మసీదులోకి మహిళలను అనుమతించాలి : సుప్రీంకోర్టు

News Telangana

Leave a Comment