గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా
గుడిలో ప్రమాణం చేసి హామీ పత్రంపై భట్టి సంతకం
తెలంగాణ దంగల్ చివరి చరణంలోకి ప్రవేశించింది. మరి కొద్ది గంటల్లో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మైకులు మూగబోతాయి. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎవరి విజన్ వారు జనంలోకి బలంగా తీసుకుపోతున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఏం చేయనుకుంటున్నారో ముందే పక్కా ఫ్లాన్‌తో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు భట్టి విక్రమార్క. కార్తీక పౌర్ణమి రోజున బోనకల్ మండలం, చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి దేవాలయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రమాణం చేశారు. మధిర నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన అఫిడవిట్‌పైన సంతకం చేశారు భట్టి విక్రమార్క.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితం అవుతానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతానని భట్టి ప్రమాణం చేశారు. నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తానన్న భట్టి, అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తానన్నారు భట్టి విక్రమార్క.
శ్రీ భక్త ఆంజనేయస్వామి ఆలయంలో భట్టి విక్రమార్క ప్రమాణం చేసిన అంశాలను వంద రూపాయల బాండ్ పేపర్‌పై ముద్రించిన అఫిడవిట్ పై దైవ సన్నిధిలో సంతకం చేశారు. మధిర నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పైన పేర్కొన్న విషయాలన్నింటికీ సదా కట్టుబడి ఉంటానని అఫిడవిట్‌తో హామీ ఇచ్చారు భట్టి.
ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వం అందించే రైతుబంధును ఆపాలని గతంలో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో అది ప్రభుత్వ పథకమని, రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర సర్కార్. రైతుబంధు ఆపడం ద్వారా రైతులు వ్యవసాయానికి పెట్టుబడి లేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని, దీనికి అనుమతి ఇవ్వాలని కోరింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో రైతుబంధు అనుమతికి ఈసీ నవంబర్ 25న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే రైతు బందు ను కాంగ్రెస్ పార్టీనే అడ్డుపడిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్న కాంగ్రెస్.. ఎన్నికల ప్రచారంలో BRS పార్టీ రైతు బందు ప్రస్తావన చేయకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.