- రెండో వారం పోటెత్తిన భక్తజనం
- బోనాలతో కిటకిట లాడుతున్న జాతర
గొలపల్లి, డిసెంబర్20 (న్యూస్ తెలంగాణ)
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి (దొంగ మల్లన్న) జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం రెండో వారం కావడం తో వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు, ప్రతీఏటా నిర్వహించే ఏడువారాలపాటు అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ఈ సంవత్సరం కూడా జాతర ఉత్సవాలను గ్రామపంచాయతీ సిబ్బంది వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు బోనాలను నెత్తిన ఎత్తుకొని ఒగ్గు పూజారుల, డమరుకనాధాల నడుమ భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ ఇష్టదైవానికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుటున్నారని ఆలయ పూజారులు కొండూరి రాజేందర్ శర్మ, కొండూరి రఘునందన్ శర్మ వేద మంత్రోచ్చారణాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గర్భగుడిలోని స్వామివారిని దర్శించు కునేందుకు ఉదయం నుంచి ఆలయం ఎదుట పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. కొందరు భక్తులు తమ నిలువెత్తు బెల్లం తులాభారం వేయించి మొక్కలు తీర్చుకుంటున్నారు. మరి కొందరు భక్తులు తమ కుల దైవానికి ఒగ్గు పూజారుల సమక్షంలో పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందో బస్తు పటిష్టంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు కావల్సిన అన్ని సౌకర్య వసతులు అందిస్తున్నామని. ఆలయ ఫౌండర్ ట్రస్ట్ కొండూరి శాంతయ్య తెలిపారు.