న్యూస్ తెలంగాణ, జగిత్యాల జిల్లా
నవంబర్-28
– – – స్వేచ్చాయుతoగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి.
– – – తెలంగాణ అసెంబ్లీ -2023 ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లా పరిధిలో 144 సెక్షన్ అమలు.
– – – జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు -2023 సందర్భంగా నవంబర్ 30న ఎన్నికలు ఉన్నందున పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు తేదీ నవంబర్ 28వ తేదీ(మంగళవారం) సాయంత్రం 5 గంటల తరువాత నుంచి, డిసెంబర్ 1వ తేదీ (సోమవారం ) ఉదయం 7 గంటల వరకు జిల్లా లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ గారు తెలిపారు.
శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు,రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT), స్ట్రయికింగ్ ఫోర్స్ మరియు స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ ను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
ఎన్నికల భద్రతా దృష్ట్యా ఎన్నికలు సజావుగా సాగటానికి ఈ దిగువ తెలిపిన నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞాప్తి చేయనైనది.
జిల్లా పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు. రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించొద్దని, ప్రదర్శించొద్దని తెలిపారు. మైకులు, స్పీకర్లు వాడరాదని, రాజకీయ పార్టీలకు సంబందించిన పాటలు, ఉపన్యాసాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటి కార్యక్రమాలను నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై,మరియు ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తేది: 28-11-2023 సాయంత్రం 5 గంటల నుండి తేది: 04-12-2023 ఉదయం 6 గంటల వరకు ప్రతీ ఒక్కరు తూచ తప్పకుండా ఎన్నికల నిబంధనలు పాటించగలరు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి గారు కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.