- సూర్యాపేట జిల్లాలో 36 ఎకరాలు సర్కారు భూమిని తన బంధువుల పేరిట మార్చిన ఆపరేటర్
- నాటి తహసిల్దార్ ప్రమేయం ఉన్నట్లు విషయంలో వెల్లడి
- ఈ కేసులో తాసిల్దార్ జయశ్రీ అరెస్ట్
- ఇప్పటికే పోలీసుల అదుపులో ఆపరేటర్ జగదీశ్
- మూడేండ్లుగా రైతు బంధులో చెరిసగం వాటా!
- 3 మండలాల్లో మరో వందల ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలు!!
- కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎంక్వైరీ!
న్యూస్ తెలంగాణ, సూర్యాపేట జిల్లా బ్యూరో, అక్టోబర్ 10 :
సూర్యాపేట జిల్లాలో ధరణిని అడ్డుపెట్టుకొని రెవెన్యూ అధికారులు సాగించిన భూబాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డలోని 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని ధరణి ఆపరేటర్ జగదీశ్ తన ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీదికి బదలాయించుకున్నట్టు గత నెలలో బయటపడగా.. ఎంక్వైరీలో కళ్లు చెదిరే అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. 20న హుజూర్ నగర్ డిప్యూటీ తహసీల్దార్ చేసిన ఫిర్యాదుతో జగదీశ్‌ను అరెస్ట్‌చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా, అప్పటి తహసీల్దార్ సూచనల మేరకే భూమిని బదలాయించానని చెప్పాడు. ఆ భూమికి డిజిటల్ పాస్ బుక్‌లు కూడా తీసుకుని మూడేండ్లుగా రైతుబంధు డబ్బులను తహసీల్దార్, తాను చెరిసగం తీసుకుంటున్నట్టు ఆధారాలతో బయటపెట్టాడు.
దీంతో బుధవారం తహసీల్దార్ జయశ్రీని పోలీసులు అరెస్ట్‌చేసి, కోర్టులో హాజరుపరిచారు. కాగా, ఇది ఒక్క బూరుగడ్డ గ్రామానికే పరిమితం కాలేదని, హుజూర్ నగర్ తోపాటు మఠంపల్లి, చింతలపాలెం మండలాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్టు అనుమానిస్తున్న అధికారులు భావిస్తున్నారు. ముగ్గురి పేర్లపై 36 ఎకరాలు బదలాయింపు
ధరణి పోర్టల్‌లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలోని రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూవివాదాలు కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కాసులు కురిపించాయి. గతంలో భూరికార్డుల ప్రక్షాళనలో అక్రమాలకు పాల్పడినవాళ్లే ఆపరేటర్ల సాయంతో ప్రభుత్వ భూములను ప్రైవేట్వ్యక్తుల పేర్లపైకి మార్చినట్టు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై దృష్టి పెట్టిన సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా.. ధరణి అపరేటర్ల అక్రమాలు బయటపడ్డాయి. బూరుగడ్డ గ్రామంలో 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కంప్యూటర్ ఆపరేటర్ వత్సవాయి జగదీశ్ తన కుటుంబసభ్యుల పేరు మీద ధరణి పోర్టల్ లో నమోదు చేసినట్టు తేలింది. ఈ విషయం తెలియగానే గతనెలలో జగదీశ్‌ను విధులనుంచి తొలగించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో శ్రీనివాసులు ఈ వ్యవహారంపై విచారణ జరిపారు. జగదీశ్ ఫ్యామిలీ మెంబర్స్ పచ్చిపాల ప్రియాంక పేరు మీద సర్వే నెంబర్ 439/55/5 లో 8.38 ఎకరాలు, సర్వే నెంబర్ 604/116 లో 7.32 ఎకరాలు , 604/58 లో 4.38ఎకరాలు, మడిపల్లి స్వప్న పేరిట హుజూర్ నగర్ సర్వే నెంబర్లో 602/122/1 లో 0.01 ఎకరాలు , జగదీశ్ తల్లి వత్సవాయి ఇందిర పేరిట సర్వేనెంబర్ 608/16 లో 8 ఎకరాలు, 1041/368/3/2/50 లో సర్వేనంబర్‌లో10 ఎకరాలు మొత్తం 36 ఎకరాల 23 గుంటల భూమిని 2019 ఫిబ్రవరి నుంచి 2020 నవంబర్ వరకు విడతలవారీగా బదిలీ చేసినట్టు ఆర్డీవో విచారణలో తేలింది.
ఇందులో తహసీల్దార్ వజ్రాల జయశ్రీ పాత్ర ఉన్నట్టు తెలియడంతో మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఎంక్వైరీ బాధ్యతలను అడిషనల్ కలెక్టర్ బీఎస్లతకు అప్పగించారు. గతంలో హుజూర్ నగర్ తహసీల్దార్ గా పనిచేసిన వజ్రాల జయశ్రీ రైతుబంధు కోసం ధరణి ఆపరేటర్ సాయంతో ఈ అక్రమాలకు పాల్పడినట్టు ఈ ఎంక్వైరీలో తేలింది. దీంతో ప్రస్తుతం నల్గొండ జిల్లా అనుముల తహసీల్దార్‌గా పని చేస్తున్న జయశ్రీని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు. ఆపరేటర్ జగదీశ్‌తోపాటు భూమి పట్టా చేసుకున్న ముగ్గురు కుటుంబ సభ్యులపై 120బీ, 420, 406, 409, 468, 467 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
రైతు బంధు డబ్బుల కోసం భూ రికార్డులను మార్పిడి చేసినట్టు జగదీశ్ పేర్కొన్నట్టు తెలుస్తున్నది. మూడేండ్లలో రైతుబంధు కింద రూ.14.63 లక్షలు రాగా జగదీశ్, జయశ్రీ సగం సగం పంచుకున్నట్టు ఆఫీసర్లు తేల్చారు. కాగా, అడిషనల్ కలెక్టర్ విచారణలో అక్రమాల వెనుక తన పాత్ర ఉన్నట్టు తేలిందని తెలిసిన జయశ్రీ.. అరెస్ట్ కాకుండా ఉండేందుకు కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఈ నెల 4న కోర్టుకు వెళ్లగా.. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించినట్టు సమాచారం. 3 మండలాల్లో వందల ఎకరాలు అన్యాక్రాంతం ఇది ఒక్క హుజూర్నగర్ మండలానికే పరిమితం కాలేదని, మఠంపల్లి, చింతలపాలెం మండలాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని రెవెన్యూ అధికారులు అనుమానిస్తున్నారు. ఆపరేటర్ జగదీశ్ ఒక్కడే దాదాపు 100 ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీదకు బదలాయించినట్టు అనుమానాలున్నాయి. హుజూర్నగర్ పట్టణం లింగగిరి, అమరవరం, వేపాల సింగారం, శ్రీనివాసపురం గ్రామాల్లో ప్రభుత్వ భూములను అధికారుల అండతో పట్టాలు చేసినట్టు భావిస్తున్నారు. టౌన్‌లోని 1041, 608, 154, 273 సర్వే నంబర్లలో సుమారు 300 ఎకరాల పైనే ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటితోపాటు గోవిందాపురం, ముక్త్యాల మేజర్ కాల్వ సమీపంలోని రామస్వామి గుట్ట దారిలో, వేపాల సింగారం రోడ్డు, మఠంపల్లి, లింగగిరిలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరుపై రికార్డుల్లో ఎక్కించినట్టు సమాచారం. ధరణి వచ్చినప్పటి నుంచి ఆన్ లైన్ లో నమోదు చేయగా, అంతకుముందు మాన్యువల్ రికార్డులను సైతం తారుమారు చేశారన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఎంక్వైరీ చేస్తున్నారు.