హైదరాబాద్ డెస్క్, ( న్యూస్ తెలంగాణ ) :- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు జరిగింది. ఈసీ రూల్స్ ప్రకారం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో మాత్రం గంట ముందే నాలుగు గంటలకే అధికారులు పోలింగ్ క్లోజ్ చేశారు. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరిగింది. పోలింగ్ టైమ్ ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిల్చున్న వారికి మాత్రమే అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పూర్తి కావడంతో ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రేపు స్పెషల్ సెలవు ప్రకటించారు. సీఈవో వికాస్ రాజ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులు నిర్వహించిన స్టాఫ్‌కు డిసెంబర్ 1న క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల పోలింగ్ రాత్రి వరకు జరగడం.. ఆ తర్వాత అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించడం ఈ ప్రక్రియ మొత్తం ముగిసే వరకు రాత్రి అవుతోంది. ఆ తర్వాత ఉద్యోగులు రాత్రి వెళ్లేందుకు సరైన ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడం.. రాత్రి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొని మళ్లీ వెంటనే ఉదయం ఆఫీసులకు వెళ్లడం కష్టమవుతోందని సిబ్బంది ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి స్పెషల్ లీవ్ మంజూరు చేశారు.