- మార్చి తర్వాత ఏం జరుగుతుందో చూడండి
- చంద్రబాబు ప్రెస్ మీట్
ఎన్నికలు సమీపిస్తున్నాయని వెల్లడి
- తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా
- అందుకే ఇన్చార్జిలను మార్చేశారని వ్యంగ్యం
– వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. మరి కొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, తన ఆలోచనలను వివరించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఓడిపోతామని తెలిసి జగన్ హడావుడిగా చర్యలు మొదలుపెట్టాడని, 11 మంది ఇన్చార్జిలను ఇతర నియోజకవర్గాలకు మార్చేశాడని అన్నారు. ఒక చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. బీసీల జపం చేస్తున్న జగన్ కు నిజంగా వారిపై అంత ప్రేమే ఉంటే పులివెందుల టికెట్ బీసీలకు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ప్రజలు తమ వ్యతిరేకతను బయటపెడుతున్నారని తెలిపారు.