హైదరాబాద్ ( News Telangana ) : గత ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’పై బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ధరణి కొందరికి భరణం.. మరికొందరికి ఆభరణం.. చాలా మందికి భారమన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపడతామని.. ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనానికి కమిటీ వేశామని గుర్తుచేశారు. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ లోపల అర్బన్ జోన్‌గా, ఓఆర్‌ఆర్ – ఆర్‌ఆర్‌ఆర్ మధ్య పెరి అర్బన్ జోన్, ఆర్‌ఆర్‌ఆర్ అవతలి ప్రాంతాన్ని గ్రామీణ జోన్‌గా ఏర్పాటు చేస్తామన్నారు.
మిషన్ భగీరథ కోసం రూ.35,752 కోట్లు ఖర్చు చేసినట్లు గత ప్రభుత్వం చెప్పిందని.. వేల కోట్లు ఖర్చు చేసినా నేటికీ సురక్షిత నీరు లేని గ్రామాలెన్నో ఉన్నాయన్నారు. ఈ పథకం లోపాల దిద్దుబాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. ‘‘గ్రామీణాభివృద్ధిలో పదేళ్లలో చోటుచేసుకున్న తప్పులను సరిదిద్దుతాం. స్థానిక సంస్థలకు హక్కులను తిరిగి అందిస్తాం. త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ ప్రకటిస్తాం. గత ప్రభుత్వ ‘రైతుబంధు’తో అనర్హులే ఎక్కువగా లాభం పొందారు. వీటి నిబంధనలను పునఃసమీక్ష చేస్తాం. అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.
‘‘నీటి పారుదల రంగంలో తప్పిదాలు ప్రగతికి అవరోధాలుగా మారాయి. నిపుణుల సలహాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం.. శాపంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణకు కార్యాచరణ ప్రకటించాం’’ అని భట్టి అన్నారు.
next post